మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రదీప్ కుమార్ అనే యువకుడు వీఆర్‌ఏ ఉద్యోగం కోసం విద్యుత్ హైటెన్షన్ మెయిన్ లైన్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. కొన్ని గంటలపాటు టవర్‌పైనే ఉండి, తనకు వీఆర్‌ఏ ఉద్యోగం ఇవ్వాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రావాలని డిమాండ్ చేస్తూ బీష్మించుకుని కూర్చున్నాడు.
ఈ విషయం తెలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, స్వల్ప అస్వస్థత ఉన్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పోలంపల్లికి చేరుకున్నారు. టవర్‌పై ఉన్న యువకుడితో మాట్లాడి అతని సమస్యలను తెలుసుకున్నారు. తాను వీఆర్‌ఏ కుటుంబానికి చెందినవాడినని, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో తమ కుటుంబం ఉపాధి కోల్పోయిందని ప్రదీప్ కుమార్ వాపోయాడు. తనతో పాటు వీఆర్‌ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీఆర్‌ఏ/వీఆర్‌వో వ్యవస్థ పునరుద్ధరణ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో ప్రదీప్ కుమార్ టవర్ నుంచి కిందికి దిగాడు.
యువకుడితో మాట్లాడిన ఎమ్మెల్యే, మనోధైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం పోరాటం చేయాలి గానీ ప్రాణాపాయానికి దారితీసే ఇలాంటి చర్యలు సరికాదని హెచ్చరించారు.
యువకుడు సురక్షితంగా కిందికి దిగడంతో అధికారులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.








