మాసాయిపేట తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో అక్రమ బెల్ట్ షాపుల దందా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ గ్రామాలు, కాలనీలలో అక్రమ మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని సమాచారం.
అధికారికంగా అనుమతులు పొందిన మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ, కొన్ని ఇళ్లలో, ఉద్యోగుల నివాసాల్లో, చిన్న కిరాణా దుకాణాల రూపంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 12 గంటల వరకు ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

స్థానికులు పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినా, అది నామమాత్రంగానే జరుగుతోందని, వ్యాపారస్తులతో మాట్లాడి తిరిగి వెళ్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా కేవలం ఫార్మాలిటీగా పర్యటనలు నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, అస్సాం, నేపాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల సంఖ్య పెరగడంతో మద్యం వినియోగం కూడా అధికమైందని సమాచారం. దీనిని అవకాశంగా తీసుకుని బెల్ట్ షాప్ యజమానులు రోజుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వ్యాపారం చేస్తున్నట్లు అంచనా.
రాత్రివేళల్లో జోరుగా అక్రమ వ్యాపారం
ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ అక్రమ మద్యం విక్రయాలు మరింతగా పెరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి ‘నైంటీ’, ‘క్వార్టర్’లుగా విభజించి అధిక ధరలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో బాటిల్‌పై అధిక ధరలు వసూలు చేస్తూ బెల్ట్ దందాను లాభదాయక వ్యాపారంగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు.

కొన్ని గ్రామాల్లో కల్తీ మద్యం, కల్తీ కల్లు కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రామాయంపేట ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మహిళలు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల సంక్షేమాన్ని కాపాడేందుకు అధికారులు చురుకుగా వ్యవహరించాలనే డిమాండ్ పెరుగుతోంది.








