చేగుంట, తూప్రాన్ డివిజన్ : తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీ-సర్వే పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆర్డిఓ జైయ చంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామంలోని ప్రతి భూమిని సమగ్రంగా సర్వే చేసి, భూ వివాదాలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 6505.09 ఎకరాల భూమిని ఫారెస్ట్, ప్రభుత్వ, పట్టా మరియు సాగు నీటి (ఇరిగేషన్) భూములుగా వర్గీకరించి సర్వే చేయనున్నట్లు తహసీల్దార్ మరియు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి వివరించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రీ-సర్వే విధానం, దాని ప్రయోజనాలు, భూ రికార్డుల స్పష్టతపై అవగాహన కల్పించారు.
ఈ గ్రామ సభలో తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్, చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్, తూప్రాన్ డిపో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే సుజాత, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








