తూప్రాన్ డివిజన్, మెదక్ : నాచారం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో కొత్త పాలక మండలి కొలువు తీరిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పలు కీలక అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు.
ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్‌కి పాలక మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చైర్మన్ వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
భక్తుల కోరిక మేరకు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని, కార్యనిర్వాహణాధికారికి ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు.
శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శన సమయాల్లో మార్పులు చేశారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పును పూజారులతో సమావేశం నిర్వహించి తీసుకున్నామని, భక్తులకు ఈ సమాచారం అందేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించామని చైర్మన్ తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రాత్రి బస చేయవలసిన పరిస్థితుల్లో ఉండటంతో, ఆలయ పరిసరాల్లోని సత్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. శుక్రవారం రోజున సత్తాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సరఫరా వంటి సదుపాయాలను మెరుగుపరచాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ రమణరావుకు సూచనలు జారీ చేశారు.
ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు ఉష, సురేందర్ రెడ్డి, కే. పద్మ, చాకలి శ్రీనివాస్, శేఖర్ సెట్, నాగరాజు సెట్, కిష్టయ్య, శ్రీహరి, తిరుమల రావు, ఎక్స్ ఆఫీసియో సభ్యులు జగన్ పంతులు, దేవస్థాన సిబ్బంది, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సహకారంతో దేవస్థానం అభివృద్ధి దిశగా వేగంగా సాగుతుందని ట్రస్ట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.