మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పనుల్లేకపోతే దూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సోమవారం (ఆగస్టు 18) కలెక్టర్ తూప్రాన్ మండలం కిష్టాపూర్–గుండ్రెడ్డిపల్లి మార్గంలోని హల్దీ వాగు వద్దకు, అలాగే వెల్దుర్తి మండలం ఉప్పిలింగాపూర్ రోడ్డులో హల్దీ వాగు పై ఉన్న బ్రిడ్జ్ ను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో కలిసి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ –
“వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. వాగులు, చెరువులు, నదుల వద్దకు ప్రజలు వెళ్లకుండా పోలీసు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేశాం. అవసరమైతే ట్రాఫిక్ మళ్లింపు ద్వారా రాకపోకలు పునరుద్ధరిస్తాం,” అని తెలిపారు.
రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి గ్రామ స్థాయిలో సహాయక చర్యలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్శనలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తాసిల్దారులు, పంచాయతీ సెక్రటరీలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగం అందరికి అండగా ఉంటుంది అని కలెక్టర్ భరోసా ఇచ్చారు.