మెదక్ జిల్లా, చెగుంట : చెగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో నిర్వహించిన నానో యూరియా డెమో కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ మాట్లాడుతూ, రైతులు నానో యూరియా వాడకాన్ని అలవర్చుకోవాలని, ఇది పంటలకు, పర్యావరణానికి ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. నానో టెక్నాలజీ ఆధారంగా తయారయ్యే ఈ ద్రవ ఎరువు వినియోగంతో పంటల దిగుబడులు మెరుగవడమే కాకుండా నేల, నీటి నాణ్యతను కూడా కాపాడుకోవచ్చన్నారు.
రైతు సిద్ధిరాములు తన పొలంలో నానో యూరియా ప్రయోగాన్ని ప్రదర్శించగా, వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ –
“సాంప్రదాయ యూరియాతో పోల్చితే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడటం వల్ల, ఇది భూగర్భ జలాలు, నేల కాలుష్యాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే, మొక్కలకు నత్రజని సమర్థవంతంగా అందించడం ద్వారా దిగుబడి పెరుగుతుంది. ఇది రవాణా, నిల్వ చేయడంలో కూడా సులభతరం.”
అలాగే, సాంప్రదాయ యూరియా వాడకంతో వాతావరణ కాలుష్యం, నేల సారత తగ్గిపోతుందని, నానో యూరియా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమని పేర్కొన్నారు. ఇది అధిక దిగుబడి ఇవ్వడమే కాకుండా, పంటల్లో పోషక విలువలను మెరుగుపరుస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాధవి, భూపాల్, రైతులు నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నానో టెక్నాలజీ పై అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.