తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు, వెంకటాపూర్ గ్రామ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలు శుభ్రమైన తాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రస్తుతం మిషనరీ దెబ్బతినడం వలన పని చేయకుండా ఉంది. ఈ కారణంగా గ్రామ ప్రజలు బోర్లు, చెరువుల నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గ్రామంలో విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల తరఫున శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ప్లాంట్ మిషనరీ మరమ్మత్తులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, వాటర్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలనే విజ్ఞప్తి ఆయన చేస్తూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి రాజిరెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, సిద్ధ గౌడ్, సత్యనారాయణ, నాగేందర్ రెడ్డి, బాబుగౌడ్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
