చేగుంట/తూప్రాన్ డివిజన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు భాగంగా మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్లో “Arrive Alive” కార్యక్రమం కింద ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా ISI ప్రమాణిత హెల్మెట్ ధరించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం బాధ దాగి ఉంటుందని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. అలాగే అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని కోరారు.
చివరగా ప్రమాదాలు విధి కాదని, మన నిర్లక్ష్య ఫలితమేనని స్పష్టం చేస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి తమ కుటుంబాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డివిజన్ డియస్పీ నరేందర్ గౌడ్, సిఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






