- మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 5000 జరిమాన
మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక సంఘటనలో, కేవలం ఏడేళ్ల చిన్నారిపై దారుణమైన లైంగిక దాడి చేసిన నేరస్తుడు థలారి మోహన్‌కు కోర్టు అత్యంత కఠినమైన శిక్ష విధించింది. ఈ తీర్పు చిన్నారికి న్యాయం చేయడమే కాకుండా, సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని అందించింది.
ఈ కేసులో పోక్సో ప్రత్యేక ప్రజా అభియోజకులు అడ్వొకేట్ బాలయ్య అనంతరం భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ అడ్వొకేట్ స్వేత చివరి వరకు అహర్నిశలు కృషి చేశారు. సాక్షులను మార్గనిర్దేశం చేస్తూ, బాలికకు ధైర్యం చెప్పుతూ న్యాయం సాధించే వరకు పోరాడారు.
బాలిక మొదట కోర్టుకు రావడానికి భయపడింది. వాంగ్మూలం ఇవ్వడానికి కూడా తీవ్రమైన ఆందోళనతో తడబడింది ఆ సమ యంలో లేడీ అడ్వొకేట్ స్వేత ఎప్పుడూ ఆమె పక్కనే ఉండి ధైర్యం చెప్పి, ఆత్మవిశ్వాసం నింపారు. ముఖ్యంగా పురుషుల సమక్షంలో వాంగ్మూలం ఇవ్వడం బాలికకు చాలా భయానకంగా అనిపించడంతో, జిల్లా జడ్జి నీలీమ ఆదేశాల మేరకు ‘వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్’లో జిల్లా జడ్జి , లీగల్ అడ్వైజర్ స్వేత , మహిళా డిఫెన్స్ కౌన్సిల్ మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా వాతావరణంలో చిన్నారి తన భయాలను అధిగమించి ధైర్యంగా, నిస్సందేహంగా వాంగ్మూలం ఇచ్చింది.
ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు కూడా ఎంతో నిబద్ధతతో, సమగ్రంగా పనిచేసి అన్ని ఆధారాలను సేకరించారు. వారి కృషిని కోర్టు ప్రత్యేకంగా అభినందించింది. అదేవిధంగా బాధిత చిన్నారి శారీరకంగా మానసికంగా అనుభ వించిన బాధలకు పరిహారం,చెల్లించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. అందుకుగాను రూ.3,00,000/- (మూడు లక్షలు రూపాయలు మాత్రమే) పరిహారం చెల్లించాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిల్లా న్యాయ సేవాధికారుల కార్యదర్శి వెంటనే చర్యలు తీసుకుని పరిహారం బాధిత చిన్నారికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, గుర్తు పెట్టని కేసు వస్తువులను అప్పీల్ సమయం ముగిసిన తర్వాత ధ్వంసం చేయాలని కూడా తీర్పు వెలువరించింది. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా అరికట్టడంలో కీలక పాత్ర పోషి స్తాయని అధికారులు పేర్కొన్నారు చిన్నారి చూపిన ధైర్యం, న్యాయం సాధనలో న్యాయవాదుల కృషి, పోలీసుల అంకిత భావం ఇవన్నీ సమాజానికి ఒక ప్రేరణగా నిలిచాయి. శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.