contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభం

  • ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా పునర్నిర్మిత ఆలయాన్ని భక్తులకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ములుగు/మేడారం: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అత్యంత వైభవోపేతంగా పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో సీఎం

ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం ఉదయం ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం, కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాతిశిలలతో చరిత్రకు ప్రాణం

ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విశేషాలకు శిల్పరూపం దిద్దుతూ, చారిత్రక కట్టడాల తరహాలో అద్భుత నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనులు చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచేలా రూపుదిద్దుకున్నాయి.
సుమారు 4 వేల టన్నుల గ్రానైట్‌ను వినియోగించి నిర్మాణాలు చేపట్టగా, ఆదివాసీ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా దాదాపు 7 వేల చిత్రాలను శిలలపై హృద్యంగా చెక్కారు. గత ఏడాది సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి ఈ పనులకు శ్రీకారం చుట్టగా, కేవలం మూడు నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయడం విశేషం.

ఆదివాసీ మూలాలు కళ్లకు కట్టినట్టు

సమ్మక్క–సారలమ్మ చరిత్ర, జాతర నేపథ్యం, ఆదివాసీల జీవన విధానం కళ్లకు కట్టినట్టుగా ఈ పునర్నిర్మాణ పనులు సాగాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, వందల ఏళ్లు చెక్కుచెదరకుండా నిలిచేలా నిర్మాణాలు పూర్తి చేశారు.

గోడలపై కోయ వంశీయుల చరిత్ర

గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా తీర్చిదిద్దారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకారాన్ని నిర్మించారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
గద్దెల ప్రాంగణానికి ఎదురుగా 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకార గద్దె చుట్టూ ఎనిమిది స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. తాళపత్రాల్లో ఉన్న కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణ గోడలపై చిహ్నాల రూపంలో చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్రను తెలిపే 59 బొమ్మలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన ఏడు వేల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మేడారం మహా జాతర ప్రారంభంతో మరోసారి ఆదివాసీ ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం ప్రపంచానికి చాటబడింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :