జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణం లో కూరగాయలు అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇరుకు రోడ్లపైనే సంత… ఒకవైపు వాహనాల రాకపోకలు.. మరోవైపు ఇరుకుగా ఉన్న దారిపైనే కూరగాయల విక్రయాలు. దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు మార్కెట్ నిర్మించేందుకు నిధులు కేటాయించినప్పటికీ పనులు ఆగిపోవడంవల్ల పిచ్చి మొక్కలు పెరిగి రాత్రి అయిందంటే చాలు మందు బాబులకు అడ్డగా మారింది. గతంలో కూరగాయల వ్యాపారం పట్టణంలోకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కొనసాగేది. సరైన స్థలం లేకపోవడంతో వ్యాపారులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అధికారులు ప్రత్యేకంగా రైతుబజార్ నిర్మించి వ్యాపారులకు దుకాణాలను అలాట్ చేశారు. అయితే ఇందులో వ్యాపారం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రత్యేక స్థలాలు ఉన్న, మార్కెట్ పనులు పూర్తి కాకపోవడం వల్ల షెడ్లు లేక రోడ్లకు ఇరువైపులా తాత్కాలిక డేరాలు వేసుకొని విక్రయాలు జరుపుకుంటున్నారు.
వ్యాపారులకు కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సరైన వసతులు కల్పించాలని కూరగాయల విక్రయదారులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల కు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఎండాకాలంలో ఎండకు ఎండుతూ, వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు చేరడంతో కూరగాయలు నీటిలో కొట్టుకపోయి నానా ఇబ్బందులకు గురవుతున్నామని, మా బాధలు చెప్పలేనివని రైతులు అధికారులపై మండిపడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో సంతకు తీసుకు వచ్చిన సరుకులు పూర్తిగా వర్షంలో తడిసిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో కొందరు నాయకులు అధికారుల స్వార్థంతో ఉన్న పాత మార్కెట్ ని మొత్తం తీసేసి ఇప్పుడు ఉండడానికి కనీసం నీడ కూడా లేకుండా పోయిందని రోడ్డుపైన కూరగాయలు అమ్ముకుంటూ నానా అవస్థలు పడుతున్నామని రైతులు బోరుమని విలపిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉన్నప్పుడు (టి ఆర్ ఎస్) కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రూ 6.50 కోట్లు తో మార్కెట్ యార్డ్ కడతామని గతంలో శిలాఫలకం శంకుస్థాపన కూడా చేశారు. ఇంతవరకు దాని పట్టించుకున్న నాధుడే లేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రైతులకు నీడ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.