జగిత్యాల జిల్లా మెట్ పల్లి కోర్టులో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెటుపల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ “రాజీ మార్గమే రాజా మార్గం. సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.
లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయవాదులు, పోలీసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విడిపోతున్న భార్యాభర్తలను న్యాయమూర్తులు రాజీ ద్వారా ఒక్కటిగా చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ, చాలా కాలంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని పేర్కొన్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లు లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్ కేసులతో పాటు రాజీ పడదగిన సివిల్ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వైవాహిక కేసులు తదితర తగాదాలకు సంబంధించిన కేసులను ఇరువర్గాల కక్షిదారులు అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. దీని వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకున్న కేసుల్లో ఇరువురు కక్షిదారులే గెలిచినట్లని, మళ్లీ పై కోర్టులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం లేదని న్యాయమూర్తులు వివరించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అరుణ్‌కుమార్, సీఐ అనిల్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.










