జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని యువత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మహారాజ్ వీరగాథలను స్మరించుకున్నారు.
మెట్‌పల్లి డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ శాస్త్రి చౌరస్తా వరకు సాగింది. జాతీయ రహదారిపై నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాషాయ జెండాలు ఎగురవేస్తూ, శివాజీ మహారాజ్ చిత్రపటాలను పట్టుకుని, డీజే కన్సోల్‌లతో బైక్‌లపై ఊరేగారు.
“జై శివాజీ… జై జై శివాజీ”, “భారత్ మాతాకీ జై”, “భవానీ మాతాకు జై” అంటూ నినాదాలు చేస్తూ ప్రాంతం మార్మోగించారు. హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహా యోధుడిగా శివాజీని కొనియాడుతూ ఆయన వీరత్వం, పరాక్రమాన్ని యువత ప్రచారం చేశారు.
జిల్లావ్యాప్తంగా పల్లెల్లో, మండల కేంద్రాల్లో, పట్టణాల్లో శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రజలు కలిసి శివాజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, యువకులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
శాంతియుత వాతావరణంలో జరిగిన ఈ బైక్ ర్యాలీతో మెట్‌పల్లి పట్టణం ఉత్సాహభరితంగా మారింది.








