మెట్‌పల్లి : మెట్‌పల్లి పట్టణంలోని ఆర్టీసీ ఇన్‌గేటు సమీపంలో గతంలో ఉన్న హనుమాన్ మందిరాన్ని రహదారికి సమీపంగా ఉండటం వల్ల భక్తుల సౌలభ్యం మరియు భద్రత దృష్ట్యా లోపలికి మార్చి, హనుమాన్ విగ్రహానికి బుధవారం ఘనంగా పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ మాల ధారణ స్వాములు సుమారు 200 మంది పాల్గొని హనుమాన్ పారాయణం పఠించారు. అనంతరం వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, పాత స్థలంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఆలయం లోపలికి తరలించి పునఃప్రతిష్ఠాపన చేపట్టారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ కౌన్సిలర్లు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, హనుమాన్ మాలధారణ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిఎం ఫిర్యాదు మేరకు మెట్‌పల్లి సీఐ అనిల్ ఆధ్వర్యంలో కోరుట్ల సీఐ సురేష్, కోరుట్ల ఎస్సై చిరంజీవి, మెట్‌పల్లి ఎస్సై కిరణ్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, దోమకొండ రమేష్, కౌన్సిలర్లు, బీజేవైఎం నాయకులు, బజరంగ్ దళ్ సభ్యులు, ఆంజనేయ స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.








