మైక్రో ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించడం అత్తాకోడళ్ల ఉసురు తీసింది. పశ్చిమ గోదావరి మొగల్తూరు మండలం బెల్లంకొండవారి మెరకకు చెందిన సుందర వెంకటేశ్వర రావు, రవిబాబు తండ్రీ కొడుకులు. వీరు ఇంటి నిర్మాణం కోసం ఐదేళ్ల క్రితం పుల్ట్రాన్ మైక్రో ఫైనాన్స్ సంస్థ వద్ద రూ.5.50 లక్షల రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణానికి నెలకు రూ.12,500 చొప్పున ఇప్పటివరకు 56 వాయిదాలు చెల్లించారు. ఈనెల 7న చెల్లించాల్సిన వాయిదా ఆలస్యం అవడంతో 23న సంస్థ ఉద్యోగులు వచ్చి వాయిదా చెల్లించకపోతే ఇంటిని వేలం వేస్తామని బెదిరించారు. దీంతో రవిబాబు భార్య భారతి ఆందోళన చెంది గుండెపోటుతో మృతిచెందారు. కోడలి మరణంతో కలత చెందిన అత్త అంజమ్మ ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రవిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
