ఢిల్లీ : విదేశాల్లో పనిచేస్తున్న, పనిచేయడానికి వెళుతున్న భారతీయ కార్మికులు, నిపుణుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వలసలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు, భద్రత కల్పించడంతో పాటు, వారు తమ ఉద్యోగ కాలం ముగిశాక తిరిగి స్వదేశానికి వచ్చేలా ప్రోత్సహించేందుకు ‘ఓవర్సీస్ మొబిలిటీ (ఫెసిలిటేషన్ అండ్ వెల్ఫేర్) బిల్లు, 2025’ను ప్రతిపాదించింది.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది డిప్లొమాట్’ కథనం ప్రకారం, ఈ కొత్త బిల్లు కేవలం వలస విధానంలో మార్పు కాదు, ఆర్థిక దౌత్యంలో కార్మిక శక్తిని ఒక మూలస్తంభంగా మార్చే ప్రయత్నం. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1983 నాటి పాత వలస చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లు సమగ్రమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానుంది. ఇది కేవలం విదేశీ ఉపాధిని సులభతరం చేయడమే కాకుండా, ఉద్యోగులు సురక్షితంగా తిరిగి రావడం, స్వదేశంలో వారి పునరేకీకరణకు కూడా భరోసా ఇస్తుంది.









