మహారాష్ట్ర – ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర కలకలం రేగింది. నగరానికి మానవ బాంబులను పంపించామని, భారీ పేలుళ్లతో ముంబైని కుదిపేస్తామని దుండగులు బెదిరింపు మెయిల్ పంపించారు. ‘లష్కర్ ఏ జిహాదీ’ అనే ఖాతా నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు ఈ సందేశం వచ్చింది. నగరంలో 34 చోట్ల వాహనాల్లో మానవ బాంబులను ఉంచామని, ఏ క్షణంలోనైనా పేలుళ్లు జరగవచ్చని అందులో దుండగులు హెచ్చరించారు. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించి సోదాలు చేపట్టారు. నగరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ లతో సోదాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే సమాచారం అందించాలని ముంబైకర్లకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మెయిల్ లో ఏముందంటే..
“పాక్ నుంచి 14 మంది ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడ్డారు. 34 వాహనాల్లో మానవబాంబులను పంపించాం. వారి వద్ద 400 కిలోల ఆర్డీఎక్స్ ఉంది. ఇప్పుడు మేం చేపట్టబోయే పేలుళ్లతో ముంబై అల్లకల్లోలంగా మారుతుంది. ఈ పేలుళ్లు నగరాన్ని కుదిపేస్తాయి” అని మెయిల్ లో పేర్కొన్నారు. తనను తాను పాక్ కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడిగా పేర్కొంటూ ఓ దుండగుడు ఈ మెయిల్ పంపించాడు.