హైదరాబాద్ : వరుసగా సెలవులు రావడంతో నాగార్జున సాగర్ కు పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా మారింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో, ఆ జలసౌందర్యాన్ని కళ్లారా చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను తమ కెమెరాలలో బంధిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో, ప్రాజెక్టు అధికారులు శనివారం నాడు జలాశయానికి చెందిన 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తారు. దీని ద్వారా స్పిల్‌వే నుంచి సుమారు 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గేట్ల నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణా జలాలు కనువిందు చేశాయి.
పర్యాటకులు ఒకేసారి పెద్ద సంఖ్యలో వాహనాల్లో రావడంతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాలు సాఫీగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.