శ్రీకాకుళం: తక్కువ మంది యువత మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారని జనసేన (Janasena) నేత, సినీనటుడు నాగబాబు (Nagababu) అన్నారు.
యువత రాకపోతే రాజకీయాల్లోకి దుర్మార్గులు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద నిర్వహించిన ‘యువశక్తి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జనసేన పార్టీ యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని నాగబాబు చెప్పారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పనిచేస్తానని చెప్పారు. వైకాపా నేతలు, సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. వైకాపా పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ సభకు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసైనికులు, పవన్ అభిమానులు వచ్చారు. దీంతో సభా ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. నేటి యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చిస్తున్నారు