నిజామాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. భార్య మీద అలిగిన ఓ భర్త, ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. సుమారు రెండు గంటల పాటు స్థానికులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సిరికొండ మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, సిరికొండ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తికి, అతని భార్యకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య అతనికి భోజనం పెట్టేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమన్, మద్యం సేవించి గ్రామ శివార్లలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
స్తంభంపైకి ఎక్కిన సుమన్ కిందకు దిగేందుకు నిరాకరించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంత బతిమాలినా వినలేదు. పైకి రావడానికి ప్రయత్నిస్తే దూకేస్తానని బెదిరించడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి, అతనికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.