మాదాపూర్ (మాకులూరు), నిజామాబాద్ జిల్లా – నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం మాదాపూర్ గ్రామంలో ఆదివాసి కొమరం భీమ్ వర్ధంతి వారోత్సవాల ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసి తోటి జాతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కురుసంగ వేణు మాట్లాడుతూ, “ఆదివాసి అమరవీరుల స్ఫూర్తిని గ్రహించి, వారి ఆలోచనలు, ఆశయాలు అమలు పరచిన రోజే వారికి నిజమైన ఘన నివాళి అవుతుంది” అన్నారు.
వర్ధంతులు, జయంతులు సమాజంలో జరుపుకోవడం ద్వారా ఆదిమతిగల ఉద్యమ స్ఫూర్తి ఉనికిని కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, పాత్రికేయులు, అధికారులు తమ వేదనలను, అభిప్రాయాలను ప్రజల ముందుకు తీసుకురావడం అవసరమని పిలుపునిచ్చారు.
ఆదివాసి సంస్కృతి, ఆచారాలను పాటిస్తూ వీరమరణం పొందిన మహానీయుల స్ఫూర్తిని స్మరించుకోవాలని, పివిటిజి (PVTG) సమూహాలకు రావలసిన నిధులు సాధించాలంటే సమైక్యతతో ముందుకు సాగాలని కురుసంగ వేణు పిలుపునిచ్చారు.
అదేవిధంగా, నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే ఆదివాసి తోటి జాతి రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించేందుకు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో ఎస్టీ, ఎస్సీ మంత్రివర్యులు వడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఎంపీ అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆదివాసి జాతి సమస్యలను ప్రభుత్వపరంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొడపల నారాయణ, నేతలు లక్ష్మణ్ శ్రీనివాస్ మిశ్రం, భోజన్న, ఆత్రం సునీత, కడప లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.









