అమరావతి : హెరిటేజ్ అవుట్‌లెట్లలో ఉల్లి కిలో రూ.35 చొప్పున విక్రయిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
హెరిటేజ్ అవుట్‌లెట్లు ఎక్కడైనా ఉన్నాయా? అలా చెప్పే వారికి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? విచిత్రమైన వింత జీవులు వాళ్లు.. వారిని ఏం చేయాలి? అయినా కొంతమంది అది నిజమని, అవుట్‌లెట్లు ఉన్నాయని నమ్ముతారేమో? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుద్ధి లేని వారికి ఏమి చెబుతామని ఆయన ప్రశ్నించారు. వీళ్లంతా ఊహాగానాల్లో జీవిస్తుంటారని మండిపడ్డారు. ఎంత వాస్తవ దూరం.. ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తుంటే వారిపై జాలి వేస్తుందన్నారు. దానిపై ఏమి మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు, ఇలాంటి విలువలు లేని వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అది మేము చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.