ఆంధ్రప్రదేశ్ : ఎన్ని సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే, రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ నుంచి ‘అన్నదాతా సుఖీభవ’ పథకంలో భాగంగా పీఎం కిసాన్ రెండో విడత నిధులను ఆయన రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ, రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదలపై ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.
గత జనవరి 19న ‘రా కదిలి రా’ కార్యక్రమానికి కమలాపురం వచ్చినప్పుడు ప్రజలు చూపిన ఉత్సాహం అద్భుతమని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ వారిలో అదే ఉత్సాహం కనిపిస్తోందని కొనియాడారు. కడప గడ్డపై మహానాడును విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీ సత్తాను నిరూపించారని స్థానిక నేతలను, కార్యకర్తలను అభినందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినా, వాటన్నింటినీ ‘సూపర్ హిట్’ చేసి చూపించామని అన్నారు. “గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసానికి గురైంది. అయినా, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు 46.85 లక్షల మంది రైతులకు రూ.14 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశాం. ఇది రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం” అని చంద్రబాబు తెలిపారు.
వ్యవసాయ రంగంలో రైతులు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని సీఎం సూచించారు. “నేనూ రైతు బిడ్డనే. మా నాన్నకు పొలం పనుల్లో సాయం చేసేవాడిని. పాత పద్ధతుల్లోనే సాగు చేస్తామంటే నష్టాలు తప్పవు. డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి. మన పంటలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది” అని ఆయన అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పంచసూత్రాలను పాటిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకే తాను పొత్తు రాజకీయాలు చేశానని, డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని చంద్రబాబు వివరించారు. “ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే నా ఏకైక సంకల్పం. కృష్ణా, గోదావరి సహా అన్ని నదులను అనుసంధానించి, రిజర్వాయర్లను నింపగలిగితే ఒక ఏడాది వర్షాలు లేకపోయినా ఇబ్బంది ఉండదు. చెరువులు నింపాలి, భూగర్భ జలాలను పెంచాలి. భూమిని ఒక పెద్ద జలాశయంగా మార్చాలి” అని తన దార్శనికతను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.









