హైదరాబాద్: పల్లెను తలపించే పచ్చని వాతావరణం.. చేతిలో నోరూరించే తియ్యటి నీరా..! ఈ అనుభూతి మహానగరం నడిబొడ్డున అందుబాటులోకి రానుంది. గీత కార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా. కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి.. దీన్నో పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘నీరా కేఫ్’కు అంకురార్పణ చేసింది. రూ.20 కోట్లతో హుస్సేన్‌సాగర్ తీరంలో దీన్ని నిర్మించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ కేఫ్ విశేషాలు..
- 7 స్టాళ్లు.. 500 మంది కూర్చునే వీలు..
- నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న దీనికి శంకుస్థాపన చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది.
- రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరా విక్రయిస్తారు.
- తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను శుద్ధి చేసి, ఇక్కడ విక్రయిస్తారు. నీరాతో తయారు చేసిన ఉప ఉత్పత్తులూ అందుబాటులో ఉంటాయి.
- మొత్తం ఏడు స్టాళ్లు ఉంటాయి. ఒకేసారి 300 – 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
- పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి వచ్చేలా నిర్మించారు.
- కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు.
- బోటింగ్.. ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం
- ఈ కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకూ బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
- ఇక్కడి ఉత్పత్తుల్ని ఇళ్లకు తీసుకెళ్లే(టేక్ అవే) సౌకర్యమూ ఉంది.
- నగర శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
- సురక్షిత పద్ధతుల్లో ప్యాకింగ్..
- నాలుగు డిగ్రీల వద్ద నీరా సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి, ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు.
- ప్రత్యేక యంత్రాల ద్వారా వడపోసి శుద్ధి చేస్తారు. ఆ తర్వాత సురక్షిత పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు