న్యూఢిల్లీ: భారత దేశానికి నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగ్‌దీప్ ధన్‌ఖడ్, వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.
జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగగా, ప్రతిపక్షం తరపున న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీచేశారు. సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ 152 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గురువారంతో మహారాష్ట్ర గవర్నర్‌గా రాజీనామా చేసి, శుక్రవారమే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను తాత్కాలికంగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు.
సీపీ రాధాకృష్ణన్ – రాజకీయ ప్రయాణం
1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. యువకుడిగా ఉండగానే ఆయన ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్ ద్వారా రాజకీయం వైపు అడుగుపెట్టారు. 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నిర్వహించిన 19,000 కిలోమీటర్ల రథయాత్ర రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం 2023లో ఝార్ఖండ్ గవర్నర్‌గా, తర్వాత 2024లో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతిగా ఎన్నికై, సేవలందించేందుకు సిద్ధమయ్యారు.