నిర్మల్ జిల్లా : తెలంగాణ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రీలో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరేశ్ గౌడ్ అనే కల్లుగీత కార్మికుడు నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులను సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో ఆయన కుటుంబాన్ని గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ చేసింది. ఆయన కల్లు దుకాణంలో కల్లు కొనుగోలు చేయరాదని, ఆయన భార్య నిర్వహించే కిరాణా షాపులో కూడా గ్రామస్తులు కొనుగోలు చేయరాదని అలా చేస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో, నరేశ్ గౌడ్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ… నరేశ్ కుటంబాన్ని బహిష్కరించలేదని చెప్పారు. కావాలనే ఆయన తమపై ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ఆయన కల్లు దుకాణంలో కల్లు సక్రమంగా ఉండటం లేదని… అందుకు ఆయన దుకాణంలో ఎవరూ కల్లు కొనుగోలు చేయడం లేదని చెప్పారు.