ఒప్పో ఫోన్లలో చార్జర్లు మాయమవుతున్నాయి..! ఆశ్చర్యపోకండి. కంపెనీలే చార్జర్లను ఇవ్వడం లేదు. ఇప్పటికే శామ్ సంగ్ ప్రీమియం ఫోన్లలో కొన్నింటికి చార్జర్లను జోడించడం లేదు. కావాలంటే వాటిని విడిగా కొనుక్కోవాల్సిందే. యాపిల్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల కంపెనీలపై చార్జర్ల వ్యయ భారం పడదు. పైగా పర్యావరణ వ్యర్థాలు కూడా తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే అప్పటికే పాత ఫోన్ కు సంబంధించి చార్జర్ ఉన్నప్పుడు కొత్త ఫోన్ తో వచ్చే చార్జర్ ను ఏం చేసుకుంటారు?
అందుకనే ఇటీవలే కేంద్ర సర్కారు అన్ని ఫోన్లకు ఒక్కటే యూఎస్ బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ ను పెట్టాలని కంపెనీలను కోరింది. దీంతో అన్ని ఫోన్లకు ఒకే చార్జర్ పనిచేస్తుంది. దీనివల్ల ఫోన్ కొన్న ప్రతిసారి కూడా చార్జర్ అవసరం పడదు. దీన్ని తాజాగా ఒప్పో కూడా ఆచరణలోకి తెస్తోంది. కాకపోతే అన్ని ఫోన్లకు కాదు. ఖరీదైన కొన్ని ఫోన్లకు ఇది అమలు కానుంది.
‘‘వచ్చే ఏడాది నుంచి కొన్ని ఉత్పత్తులకు బాక్స్ నుంచి చార్జర్ తొలగించనున్నాం. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళిక ఉంది’’ అని ఒప్పో ఓవర్సీస్ సేల్స్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ ప్రకటించారు. చార్జర్లను బాక్స్ నుంచి తొలగించి స్టోర్లలో అందుబాటులో ఉంచాలన్న ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. దీంతో యూజర్లు వాటిని కొనుగోలు చేసుకుని, ఫోన్ అప్ గ్రేడ్ అయినా అదే చార్జర్ వినియోగించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో అన్ని ఫోన్లకు ఇదే విధానం అమలయ్యే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి.