పల్నాడు జిల్లా, నరసరావుపేట: సత్తెనపల్లి రోడ్డులో ఉన్న మైనారిటీ కళాశాల వద్ద ముస్లిం సంఘాలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనారిటీ కళాశాలను కేంద్రియా విద్యాలయాలకు కేటాయించాలన్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మైనారిటీ ఆస్తులను కాపాడాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కళాశాల ప్రాంగణం వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సంఘాల నాయకులు, విద్యార్థులు, స్థానికులు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు.
దీంతో సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు.
నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారులు ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు.








