పల్నాడు జిల్లా – కోటప్పకొండ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిన కోటప్పకొండ పాత కోటయ్య గుడికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఆరు నెలలలోపు పాత కోటయ్య గుడికి మెట్ల దారిని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు.
గురువారం సాయంత్రం కలెక్టర్ కోటప్పకొండను సందర్శించి త్రికోటేశ్వర స్వామి దర్శనం చేశారు. అనంతరం ఎకో పార్కు, చిల్డ్రన్స్ పార్కు, నాగరవనం వంటి పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఆమె మాట్లాడుతూ, “కోటప్పకొండకు ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఎకో టూరిజం, సైట్ సీయింగ్‌కు అనుకూలంగా మారుస్తాం. రాబోయే కార్తీక మాసం, సంక్రాంతి, శివరాత్రి పర్వదినాల్లో భక్తుల రాక అధికంగా ఉండటంతో, ముందు జాగ్రత్తగా వసతి, రవాణా, తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలను విస్తరించే పనిలో ఉన్నాం” అని అన్నారు.
ఈ సందర్శనలో కలెక్టర్‌తోపాట జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, కోటప్పకొండ ఆలయ ఈవో, జిల్లా దేవదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కోటయ్య గుడికి మెట్ల దారి ఏర్పాటయ్యే వార్త భక్తుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది. ఈ మార్గం పూర్తయితే పర్యాటకులకు కూడా ఈ ప్రాంతం మరింత సులభంగా చేరదగిన గమ్యంగా మారనుంది.