పార్వతీపురం : జిల్లాలో నాటు సారాను అరికట్టి కుటుంబాలను కాపాడుదామని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాటు సారాయితో యువత కూడా అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. అనారోగ్యం వలన పని చేసే శక్తి తగ్గి కుటుంబ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించినపుడు లక్షలలో ఖర్చు చేస్తున్నా ఆరోగ్యం మెరుగు కాకా మృత్యువాత పడుతున్నారని ఆయన చెప్పారు. మృత్యువాత పడటంతో కుటుంబం , ముఖ్యంగా చిన్నారుల భవిత అగమ్యగోచరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అటువంటి కుటుంబాలలో చైతన్యం తీసుకువచ్చి, నాటు సారాకు దూరం చేసి జీవనోపాదుల కల్పనకు చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారికి విధిగా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ ప్రాంతం గుండా, బస్సులు, ఇతర వాహనాల ద్వారా జరిగే మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వలన కలిగే చెడు ప్రభావాలపై గ్రామ స్థాయిలో, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా కాకుండా అడ్డుకట్ట వేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి , ఏఎస్పీ అంకిత సురాన, డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి టి.దుర్గాప్రసాద్, జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి ఆశా షేక్, ఇతర అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.