గుమ్మలక్ష్మీపురం మండలం: నేటి బాలలే రేపటి పౌరులు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శుక్రవారం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, విద్యార్థినులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పాఠశాలకూ ఉపాధ్యాయులకూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఈ విద్యాలయం రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ప్రత్యేక గర్వకారణమన్నారు. ఈ విజయానికి శ్రమించిన మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
పదో తరగతి విద్యార్థులు మరింత కృషి చేసి ఈసారి కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జగదీశ్వరి విద్యార్థినులకు నోటుబుక్స్, పెన్నులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర రావు, నాయకులు నీలకంఠం, సుబ్బలక్ష్మి, శంకర్, ఆనంద్, రామారావు, మనోహర్, లోవరాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










