పెద్దపల్లి జిల్లా : వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేలా, రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా మార్చాలానే సదుద్దేశంతో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా రాత్రి వేళల్లో వాహన రాకపోకలు తగ్గించాలని, రోడ్ల పక్కన వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నివారించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో రాత్రి సమయంలో ఆలస్యంగా, తెల్లవారుజామున వాహనాల ప్రయాణం కారణంగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమీషనరేట్ ట్రాఫిక్ పోలీసు శాఖ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. నిద్రమత్తు, మద్యం సేవించి డ్రైవింగ్, మితిమీరిన అతివేగం వంటి ఇతర కారణాలతో రాత్రి, తెల్లవారుజామున సమయంలో ఎక్కువ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, రాత్రి 11 గంటల తరువాత అవసరం లేని, ప్రయాణాలు చేయకుండా, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేసేలా ఉండాలని ప్రజలను సీపీ విజ్ఞప్తి చేశారు.
రాత్రి వేళల్లో రోడ్ల పక్కకు వాహనాలను నిర్లక్ష్యంగా పార్క్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ కావున రోడ్లు, హైవేలు, జంక్షన్లు, సర్వీస్ రోడ్లపై బాధ్యత రాహిత్యంగా పార్క్ చేసిన వాహనాలపై ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
ప్రజలు, వాహనదారులు పాటించాల్సిన ముఖ్య సూచనలు:
- అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాత్రి ఆలస్యంగా ప్రయాణాలు చేయడం మానుకోవాలని సూచించారు
- రోడ్ల పక్కన, నేషనల్ హైవేలు, జంక్షన్లు మరియు సర్వీస్ రోడ్లపై వాహనాలను పార్క్ చేయకూడదు.
- వాహనం లో సాంకేతిక లోపం కారణంగా నిలిపివేయాల్సి వస్తే వెంటనే హెచ్చరిక లైట్లు ఆన్ చేసి, సహాయం కోసం హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని సూచించారు.
- ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ, భద్రత మొదటి ప్రాధాన్యత అని రాత్రి వేళల్లో పర్యవేక్షణ, విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ విధులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్‌మెంట్ మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సీపీ తెలిపారు.









