పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం లక్ష్యంగా “అన్నదాత సుఖీభవ” ఇంటింటి ప్రచార కార్యక్రమం భాగంగా “రైతన్నా.. మీకోసం” ఉద్యమం కొనసాగుతోంది. గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు స్వయంగా గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు రైతుల ఇళ్లకు వెళ్లి వారికి ప్రత్యేక కరపత్రాలను అందజేశారు. వ్యవసాయంలో పంచ సూత్రాలను అమలు చేయడం ద్వారా రైతులు పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు అధిక లాభాలు సాధించవచ్చని ఆయన వివరించారు. ప్రకృతి సహజ సిద్ధ పద్ధతులను ఉపయోగించడం వల్ల నేల సారవంతం పెరగడంతో పాటు పంటల దిగుబడి మెరుగుపడుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










