పాకాల: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన జాతీయ ఉపాధి పథకంలో ఉపాధి పొందుతున్న కూలీలకు బయోమెట్రిక్ మరియు ఐరిష్ హాజరు తప్పనిసరి చేయాలి అని ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొంత కాలంగా ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారుల ఎంపిక, కూలీలకు పనులు కల్పించే విషయంలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లుతున్నాయి అని వస్తున్న ఆరోపణలకు ఈ పద్ధతి అడ్డుకట్ట వేస్తుంది అని ప్రజలు అంటున్నారు . కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాయాజాలంతో కూలి పనికి రాకపోయినా వాళ్ల జాబ్ కార్డుల ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక సమాధానంగా నిలుస్తుందన్నారు. బయట రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసేవారు సైతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జాబ్ కార్డుల ద్వారా గుంతలు తీశామని ప్రభుత్వాన్ని తప్పు ధోవ పట్టిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఉన్న లబ్ధిదారుల ఆధార్ కార్డ్, పాన్ కార్డు, బ్యాంక్, మరియు పోస్టల్ అకౌంట్ లింక్ చేసి వారి కుటుంబానికి సంవత్సర ఆదాయం ఎంత వుందో చూడాలని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారా..! పక్క రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్నారా..! ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది . ఉపాధి హామీ పథకంలో అధికారులకు ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య పరస్పర అవగాహనతో దొంగలు ఊర్లు పంచుకున్నట్లు సాగుతున్న ఈ ప్రక్రియ సరికాదు అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ప్రస్తుత పాలకులు, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది వ్యవహరించాలని తెలియజేసారు.
