పార్వతీపురం మన్యం జిల్లా : మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశాయి. అనేక గ్రామాలు నీటమునిగి రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గురువారం ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి స్వయంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వొమ్మిగెడ్డ ఉధృతి – రాకపోకలకు ఆటంకం:
జియ్యమ్మ వలస మండలంలోని డాంగభద్ర పంచాయతీ పరిధిలో వొమ్మిగెడ్డ ఉధృతంగా ప్రవహించి జియ్యమ్మ వలస–వీరఘట్టం రహదారిపై రాకపోకలను పూర్తిగా అడ్డుకుంది. వరదనీరు రోడ్డుపైకి చేరడంతో బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు, ఆరోగ్య సదుపాయాలు, స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే జగదీశ్వరి, వంతెన నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను ఇప్పటికే తీసుకెళ్లగా, సానుకూల స్పందన లభించిందని ఆమె వెల్లడించారు.
తుఫాన్ బాధితులకు సహాయ పంపిణీ:
డాంగభద్ర గ్రామంలో తుఫాన్ ప్రభావిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జగదీశ్వరి, తక్షణ సహాయ చర్యలను చేపట్టారు. ఒక్కొక్క కుటుంబానికి 20 కేజీల బియ్యం, కూరగాయలు, నూనెతో పాటు రూ.3,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలను ఓదార్చి, ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

పంట నష్టం పరిశీలన – అధికారులకు ఆదేశాలు:
తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతుల సమస్యలను విన్న ఆమె, పంట నష్టాన్ని వేగంగా అంచనా వేసి, పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఎంఆర్‌వో విజయలక్ష్మి, ఎంపీడీవో కె.ధర్మారావు మరియు సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టంతో బాధపడుతున్న రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు:
ఈ పర్యటనలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తో పాటు, అరకు పార్లమెంట్ టిడిపి అధికారి ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, జియ్యమ్మ వలస టిడిపి మండల అధ్యక్షులు జోగి భుజంగరావు, టిడిపి సీనియర్ నాయకుడు పల్లా రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.









