contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇంటి నుంచి కేసు నమోదు చేసే అవకాశం – ఫోన్​ కాల్​తో ఇంటి వద్దకే పోలీస్​ అధికారి

బాలికలు, మహిళలు విద్య కోసం పాఠశాలలకు, ఉద్యోగాల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఆకతాయిల వేధింపులు, దాడులు వంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది బాధితులు మానసిక వేదనకు లోనవుతూ విషయం ఎవరికీ చెప్పలేక, ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఈ తరహా బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

కొన్ని ప్రత్యేక నేరాల విషయంలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో భాగంగా, ప్రత్యేక పరిస్థితుల్లో పోలీసులే బాధితుల ఇంటికి వెళ్లి కేసు నమోదు చేయాలని నిర్ణయించింది.

మానసిక ఒత్తిడిని తగ్గించేందుకే నిర్ణయం

తీవ్రమైన నేరాలకు గురైన బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముంటుందని గుర్తించిన పోలీస్ శాఖ, వారి గౌరవానికి, హక్కులకు భంగం కలగకుండా న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విధానం అమలుకు సీఐడీ ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ) రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వోలు) తప్పనిసరిగా ఈ ఎస్‌వోపీని అనుసరించాలని సీఐడీ చీఫ్ చారుసిన్హా ఆదేశించారు.

పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) నిబంధనల ప్రకారం నేరం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే స్పందించి, జీరో ఎఫ్‌ఐఆర్ సహా ఏ రూపంలోనైనా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.

ఫోన్ కాల్ చేస్తే ఇంటికే పోలీసులు

ప్రత్యేక నేరాల సందర్భాల్లో బాధితులు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే, సంబంధిత పోలీస్ అధికారి వారి ఇంటికే వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్‌కు పంపించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితులకు అందజేస్తారు. అవసరమైన చోట సాక్ష్యాల సేకరణ, బాధితుల వాంగ్మూలం నమోదు వంటి చర్యలు అక్కడికక్కడే చేపడతారు.

ఈ కేసుల్లో ఎస్‌వోపీ అమలు

  • మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు

  • శారీరక దాడుల కేసులు

  • పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులు

  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు

  • బాల్య వివాహాల నిషేధ చట్టానికి సంబంధించిన కేసులు

  • ర్యాగింగ్ నిరోధక చట్టం కింద నమోదయ్యే నేరాలు

  • ఆస్తి వివాదాల్లో బాధితులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన సందర్భాలు

సి-మిత్ర ద్వారా ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్

డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరో విప్లవాత్మక అడుగు వేశారు. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ వంటి సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సి-మిత్ర ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకునే సౌలభ్యం కల్పించారు. ఫిర్యాదు ప్రక్రియ మొత్తం ఇంటి నుంచే పూర్తయ్యేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

గత ఏడాది రూ.251 కోట్ల సైబర్ మోసాలు

రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గత సంవత్సరం సైబర్ నేరగాళ్లు రూ.251 కోట్ల మేర ప్రజల సొమ్ము కాజేశారు. ముఖ్యంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లోనే ఎక్కువ మోసాలు చోటు చేసుకున్నాయి.

సైబర్ నేర బాధితుల కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. బషీర్‌బాగ్‌లోని సీపీఎస్ కార్యాలయంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ సి-మిత్ర సేవలను ప్రారంభించారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన న్యాయం అందించడమే సి-మిత్ర ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :