contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేపే పోలింగ్ .. ప్రశాంత పోలింగ్​పై ఈసీ నజర్

AP Elections 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్ నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా సగం చోట్ల వెబ్‌ కాస్టింగ్ నిర్వహించనున్నారు.
AP Elections 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరిదశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని, హింసా రహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2 కోట్ల, 3 లక్షల 39 వేల 851 మంది పురుషులు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

థర్డ్‌ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీసు ఓటర్లు 68 వేల 185 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46వేల 389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది.

రాష్ట్రవ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బంది పనిచేయనున్నారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 30వేల 111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 12వేల 459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం ముగ్గురు ప్రత్యేక సాధారణ, పోలీసు, వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లును ఈసీ నియమించింది.

లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్ధులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో ఆరుగురు మాత్రమే పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్ధులు పోటీపడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. శాసనసభకు పోటీపడుతున్న వారిలో అత్యధిక కేసులు ఉన్న అభ్యర్ధిగా వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అలాగే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా గుంటూరు లోక్ సభకు కూటమి తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :