పార్వతీపురం మన్యం జిల్లా. తాగునీటి కొరత ఎక్కడా తలెత్తరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. తాగునీరు, ఇసుక, ప్రజల స్పందన, ఎంఎస్ ఎంఇ సర్వే, స్వర్ణ ఆంధ్రా – స్వచ్చ ఆంధ్రా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అంశంపై రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి రోజూ తాగునీటి అంశాలపై దృష్టి సారించి ఎక్కడ సమస్య తలెత్తినా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నిధులకు కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా పశువుల తాగునీటిపైనా శ్రద్ధ వహించాలని ఆయన పేర్కొన్నారు. పిఎం సూర్య ఘర్ క్రింద సౌర విద్యుత్ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తే ఏడాదికి ఒక ఎకరాకు రూ.31 వేలను అద్దెగా చెల్లించడం జరుగుతుందని ఆయన చెప్పారు. వర్షాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఇసుక నిల్వలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుక రవాణాపై గట్టి నిఘా పెట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా వంటి
కనీస సదుపాయాలుపై జిల్లా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మన మిత్ర, శక్తి యాప్ లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన చెప్పారు. ఎంఎస్ ఎంఇ సర్వే త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎంఎస్ ఎంఇ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించాలని ఆయన తెలిపారు.
3వ శనివారం స్వర్ణ ఆంధ్రా స్వచ్చ ఆంధ్రా
మూడవ శనివారం స్వర్ణ ఆంధ్రా – స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంను నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలని, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన అన్నారు. “ఇ వేస్ట్ రీసైక్లింగ్” థీమ్ తో ఈ నెల కార్యక్రమం చేపడుతున్నామని ఆయన చెప్పారు. అన్ని శాఖలలో ఉన్న ఇ వెస్ట్ ను గుర్తించాలని ఆయన సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, జిల్లా రెవిన్యూ అధికారి కె హేమలత, ఈపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీర్ కోడా చలపతిరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తమర్భ కొండలరావు, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీర రాజు, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఇన్ ఛార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి పి సీతారాము తదితరులు పాల్గొన్నారు.










