కొండేపి నియోజకవర్గం: ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలో ఉన్న సురారెడ్డిపాలెం, వల్లూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్త వాస్తవం. టీటీడీ నెయ్యి కల్తీ ఘటనపై సిట్ ఏర్పాటు చేశాం. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నట్లయితే, వారిని వదిలే ప్రసక్తే లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థతో కూడి విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని చెప్పారు.
అయితే, పేద ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. “మునుపు 3,000 రూపాయల పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచాం. మూడునెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయలు జులై 1న అందించాం” అని వివరించారు.
గతంలో 200 రూపాయల పెన్షన్ ను 1,000 రూపాయలకు పెంచిన తర్వాత, 2,000 రూపాయలకు పెంచామని, మునుపటి ప్రభుత్వం 2,000 నుండి 3,000 రూపాయలకు పెంచేందుకు 5 సంవత్సరాల సమయం తీసుకుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, “విభిన్న ప్రతిభావంతులకు 3,000 నుండి 6,000 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 నుండి 10,000 రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 నుండి 15,000 రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగింది” అని తెలిపారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సామాజిక పెన్షన్ మంజూరు చేస్తోన్నట్లు చెప్పారు.
ఈ నెల అర్హత ఉన్న లబ్దిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. అంతేకాక, ఎస్.సి., ఎస్.టి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా 5,000 మందికి వసతి భవనాల్లో ఉచిత శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈరోజు జిల్లాలో 2,88,144 మందికి 122 కోట్ల 64 లక్షల రూపాయలు పింఛన్ కింద అందించారని మంత్రి చెప్పారు.