‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ తనదైన శైలిలో సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఓ కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల చుట్టూ తిరుగుతూ తీవ్ర చర్చకు దారితీశాయి.
“మహాప్రభూ, ఓ చిలిపి సందేహం” అంటూ ఆయన తన ట్వీట్‌ను ప్రారంభించారు. “మీరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక ఓ కుట్ర దాగి ఉందా? మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ కుర్చీలో కూర్చోబెట్టే ప్లాన్ ఏమైనా ఉందా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ ట్వీట్‌తో ఆయన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమవుతోంది.
అయితే ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఎక్కడా రాష్ట్రం పేరు గానీ, నాయకుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. కానీ, ‘మాజీ ముఖ్యమంత్రి’, ‘ప్రస్తుత ముఖ్యమంత్రి’, ‘ఉప ముఖ్యమంత్రి’ వంటి పదాలు వాడటంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని, పరోక్షంగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించే ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.