- గీతం అతిథ్య ఉపన్యాసంలో సూచించిన విశిష్ట భౌతిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ బీవీఆర్ టాటా
ఏ పరిశోధనకైనా ప్రకృతే మూలమని, దాని నుంచి ప్రేరణ పొంది, వాటికి ప్రయోగశాలలో ఆచరణాత్మకంగా రుజువు చేయాలని భౌతిక శాస్త్ర విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బీ.వీ.ఆర్.టాటా సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫొటోనిక్ స్పటికాల నమూనాల ఘర్షణ: భౌతికశాస్త్రం, సెన్సింగ్ అప్లికేషన్స్’ అనే అంశంపై మంగళవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు.
కొల్లాయిడల్ క్రిస్టల్ టెంప్లేట్లు మూడు కోణాలలో నానోమీటర్ నుంచి సబ్మెక్రోమీటర్ లక్షణాలతో ఆవర్తనాలను నిర్మించడానికి బహుముఖ సింథటిక్ సాంకేతికగా మారుతుందన్నారు. ఈ సాంకేతికత విభిన్న పరిమాణాలు, స్వరూపాలు, కూర్పులతో పోరస్ పదార్థాల సంశ్లేషణను అనుమతించడమే గాక, వివిధ సెన్సింగ్ అప్లికేషన్లకు దారితీస్తుందని చెప్పారు.
ఎలక్ట్రాన్ల కంటే ప్రోటాన్లను ఉపయోగించడం నల్ల కలిగే ప్రయోజనాలను నివరిస్తూ, ప్రోటాన్లు పరమాణువులతో ఢీకొనే అవకాశం ఉందని, తత్ఫలితంగా ఎక్స్- కిరణాలు విడుదలవుతాయన్నారు. ఇది భవిష్యత్తులో మరింత ప్రత్యేకమైన పదార్థాలు, అప్లికేషన్ల అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. అధ్యాపకులు, విద్యార్థుల ప్రశ్నలకు జవాబులివ్వడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి. విశ్వం అతిథికి జ్ఞాపికను అందజేసి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉపన్యాసం భౌతికశాస్త్రంలో అత్యాధునిక పరిజ్ఞానం, దాని అనువర్తనాలపై లోతైన అవగాహనను ఏర్పరచింది.