కొమరాడ మండలం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు జంఝావతి రబ్బర్ డ్యామ్ వద్దకు వచ్చిన ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. పోలీసుల సమాచారం మేరకు అదే మండలంలోని శివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, సంతోష్ కుమార్, అరసాడ ప్రదీప్ ఆదివారం సాయంత్రం జంఝావతి రబ్బర్ డ్యామ్‌ను సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు డ్యామ్ నీటిలోకి దిగగా, నీటి ఉధృతి లేదా లోతు అంచనా వేయలేక ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










