జియ్యమ్మవలస : పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన్యం ముస్తాబు’ కార్యక్రమం విద్యార్థుల్లో సానుకూల మార్పులకు దారితీస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం జియ్యమ్మవలస మండలం పెద మేరంగి జంక్షన్‌లోని తిరుమల సాయి హైస్కూల్‌లో ‘ఈ వారం ముస్తాబు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆరోగ్యం – పరిశుభ్రతే లక్ష్యం:
గత సోమవారం నుండి శనివారం వరకు విద్యార్థులు ఆహార నియమాలు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత అంశాల్లో చూపిన ప్రతిభను ఉపాధ్యాయులు సమగ్రంగా పరిశీలించారు. ప్రతి తరగతి నుండి ఉత్తమంగా ప్రదర్శన చేసిన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
క్రమశిక్షణకు ప్రాధాన్యం:
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీవాడ శంకరరావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఈ ముస్తాబు కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, శుభ్రత పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







