పార్వతీపురం – కురుపాం : గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు పోషకాహారాన్ని నిరంతరం అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన సూచించారు.
శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలలో భాగంగా కురుపాం, దుడ్డుకల్లు, దొరజమ్ము, రేగిడి, టిక్కుభాయిల గ్రామాల్లోని గిరిజన బాలబాలికల ఆశ్రమోన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల వసతులు, తాగునీటి సదుపాయాలు, స్నానపు గదులు, మరుగుదొడ్ల పరిశుభ్రత, వసతి గృహాల పరిసరాలు, పాఠశాల ఆవరణ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు అందించే భోజనం గురించి, హాస్టల్ వసతుల గురించి వివరంగా అడిగారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లను కూడా పరిశీలించారు.
“విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించాలని, ఆరోగ్య పరిరక్షణకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని” జేసీ స్పష్టం చేశారు. మరుగుదొడ్లను, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే అంటువ్యాధుల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.
పిల్లల భోజనంలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండేలా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనారోగ్యానికి గురయ్యే విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. J.C. తన సందర్శనతో ఆశ్రమ పాఠశాలల్లో చురుకుదనం ఏర్పడింది.