పార్వతీపురం – గుమ్మలక్ష్మీపురం, : ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
కురుపాం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ప్రజల కోసం శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో “ప్రజా దర్బార్” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా భూమి సమస్యలు అధికంగా ప్రస్తావించబడ్డాయి. అనేక మంది భూ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే పలువురు వికలాంగులు తమకు పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, మరికొందరు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, “ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలు తెలిపే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన అధికారులకు అప్పగిస్తాం” అని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ప్రతి కార్యక్రమం దిశానిర్దేశకంగా ఉంటుందన్నారు. ప్రజా దర్బార్‌లో ఐదు మండలాల ప్రజలు పాల్గొనడం విశేషం.