ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల సమగ్ర నాయకత్వంలో రాష్ట్రం ఐటీ రంగంలో భారీ దూసుకెళ్తోంది. దానికి నిదర్శనంగా, ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్, దక్షిణాసియాలోనే అతిపెద్ద 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
ఈ విషయంపై స్పందించిన గరుగుబిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బోను శివ, కేవలం 16 నెలల్లోనే ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఐటీ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి – సంక్షేమానికి సమ ప్రాధాన్యం
బోను శివ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రజలకు గుణాత్మకంగా మారిన పాలన అందుతోంది,” అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వచ్చిన ఈ ఐటీ పెట్టుబడులు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తున్నాయని చెప్పారు.
ఐటీ విద్యార్థులకు వెలుగుతున్న ఆశాజ్యోతి
గూగుల్‌తో పాటు యాక్సెంచర్, టీసీఎస్ వంటి ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలు విశాఖపట్నం వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్న బోను శివ, “ఇందువల్ల ఇంజనీరింగ్, ఎంసీఏ విద్యార్థులకు ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చిన మన యువత ఇక విశాఖపట్నంలోనే తమ కలలను నెరవేర్చుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు.
ఉపాధితో పాటు ప్రాంత అభివృద్ధికి బాట
ఈ భారీ పెట్టుబడులు స్థానిక యువతకు ఉపాధిని కల్పించడంతోపాటు, విశాఖపట్నం నగరాన్ని దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ప్రధాన కేంద్రంగా నిలబెడతాయని బోను శివ ఆశాభావం వ్యక్తం చేశారు. “విశాఖ భవిష్యత్తు మారుతోంది, ఇది కచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల విజయగాధ” అని ఆయన స్పష్టం చేశారు.