పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయ్ చంద్ర కలిసి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, భవన నిర్మాణానికి రూ. 60 లక్షల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. వన్ స్టాప్ భవన నిర్మాణం వలన మహిళలకు కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి కలిసి భవన నిర్మాణ శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను నాయకులు పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించి, వారికి పసుపు, కుంకుమ అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులు ప్రధానం చేశారు.
అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో మంత్రి, ప్రభుత్వ విప్ ఫోటో దిగారు.ఈ కార్యక్రమంలో పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పీ అంకిత సురాణ, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గతో సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు.