- ఎడ్యుకేషన్ ఐకాన్ 2025′ అవార్డు ప్రదానం!
విశాఖపట్నం/జియ్యమ్మవలస మండలం: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విజయనగరం ఉమ్మడి జిల్లా , పెద మేరంగి జంక్షన్‌లో గల తిరుమల సాయి హైస్కూల్ జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. విద్యారంగంలో 25 సంవత్సరాలకు పైగా చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, 2025 సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా అందించే ప్రతిష్ఠాత్మక ఎడ్యుకేషన్ అవార్డును ఈ పాఠశాల కైవసం చేసుకుంది.
గ్రామీణ విద్యార్థుల బంగారు భవితకు 25 ఏళ్ల కృషికి గుర్తింపు: గత రెండున్నర దశాబ్దాలుగా తిరుమల సాయి హైస్కూల్ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల కోసం అత్యున్నత శిక్షణ అందిస్తూ వస్తోంది. ఈ పాఠశాల విద్యార్థులు ఉత్తమ విద్యావంతులుగా తయారై, నేడు దేశంలోని వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడడంలో పాఠశాల సిబ్బంది, యాజమాన్యం చేసిన కృషి అత్యంత అభినందనీయం. ఈ విశేషమైన సేవలను, అంకితభావాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది.
విశాఖపట్నంలో ఘనంగా అవార్డు ప్రదానం:ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం 2025/10/23 వ తేదీన విశాఖపట్నంలోని ఫెయిర్ ఫీల్డ్ మారియట్ హోటల్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ముతుకుమిల్లి భరత్ చేతుల మీదుగా తిరుమల సాయి హైస్కూల్‌కు ఎడ్యుకేషన్ అవార్డును అందించారు.
అవార్డు ప్రధానోత్సవంలో బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధ్యక్షులు మల్లా రాము నాయుడు, మల్లా శ్రీవాణి మరియు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ (విశాఖపట్నం) ప్రతినిధులు పాల్గొన్నారు.
గతంలోనూ ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు: తిరుమల సాయి హైస్కూల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఇది తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం కూడా ఈ పాఠశాల హైదరాబాద్‌లోని హైటెక్స్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డును అందుకుంది. ఈ రెండు జాతీయ స్థాయి గుర్తింపులు పాఠశాల నాణ్యమైన విద్యకు, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అన్-ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు తులసి ప్రసాద్ , ముని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ నిషా అధ్యక్షులు కులభూషణ్ (ఢిల్లీ)తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్‌లు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అభినందనలు తెలిపిన పాఠశాల యాజమాన్యం:ఎడ్యుకేషన్ ఐకాన్ 2025 అవార్డు దక్కడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతివాడ శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అరుదైన గౌరవం పట్ల అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లోనూ విద్యారంగంలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది.









