మన్యం జిల్లా / కురుపాం: మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కురుపాం నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విజ్ఞప్తి చేశారు.
ఆమె గుమ్మలక్ష్మీపురం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. అనంతరం కురుపాం మండలంలోని లేవిడి, గుంజరాడ, బొడ్డమానుగూడ గ్రామాల లోతట్టు ప్రాంతాలు, కొండవాగులును స్వయంగా పరిశీలించారు.
బొడ్డమానుగూడ గ్రామంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న వృద్ధులను సురక్షిత భవనాలకు తరలించాలని ఆమె సూచించారు. జి.శివడ కూడలిలో వరి నూర్పు చేస్తున్న రైతులతో మాట్లాడి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున త్వరగా పనులు ముగించుకోవాలని సూచించారు.
తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు ఆదేశించారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని సూచిస్తూ, బలమైన గాలులు మరియు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇంట్లోనే ఉండాలని, బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ పర్యటనలో స్పెషల్ ఆఫీసర్ ధర్మచంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కేవీ కొండయ్య, అలాగే పలువురు నాయకులు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









