జియ్యమ్మ వలస (పార్వతీపురం మన్యం జిల్లా) : “కావ్యేషు నాటకం రమ్యమ్” అనే శాస్త్రీయ పరంపరను కొనసాగిస్తూ, నాటక కళ ద్వారా సమాజంలో చైతన్యం నింపాలనే లక్ష్యంతో మేరంగి నాటక పరిషత్ ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు నవంబర్ 7, 8, 9 తేదీల్లో పెదమేరంగి జంక్షన్‌లోని సత్య కైలాస్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కమిటీ బుధవారం పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించింది.
నాటికలు ఒకప్పుడు అంటరానితనం, వరకట్నం, భూస్వామ్య వ్యవస్థ అణచివేత వంటి సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాయని వక్తలు గుర్తుచేశారు. సాంకేతిక యుగంలో ఈ కళ తన ప్రభావాన్ని కొంత కోల్పోయినా, దాన్ని తిరిగి ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ పోటీలు అని తెలిపారు.
“కళ కళ కోసం కాదు, ప్రజల కోసం, సామాజిక చైతన్యం కోసం” అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
మూడు రోజులు, ఏడు నాటికలు
పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన అత్యుత్తమ నాటికలు ప్రదర్శించబడతాయి.
నవంబర్ 7:
రాత్రి 8 గంటలకు స్వప్నం రాల్చిన అమృతం
రాత్రి 9 గంటలకు మా ఇంట్లో మహాభారతం
నవంబర్ 8:
రాత్రి 8 గంటలకు అసత్యం
రాత్రి 9 గంటలకు గారడి
రాత్రి 10 గంటలకు ఓ కాశీవాసి రావయ్య
నవంబర్ 9:
రాత్రి 8 గంటలకు అమ్మ చెక్కిన బొమ్మ
రాత్రి 9 గంటలకు మనిషి కన్నా శవం మిన్న
ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి నాటక కళాకారులను ప్రోత్సహించాలని కమిటీ కోరింది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రతిరోజు లక్కీ డ్రా కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గౌరవ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో మేరంగి నాటక పరిషత్ ఏర్పాట్లు పూర్తి చేసింది. నాటక కళను తిరిగి ప్రజల్లోకి తీసుకురావడం, చైతన్యానికి వేదికగా నిలపడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పరిషత్ సభ్యులు తెలిపారు. ప్రజలందరూ విచ్చేసి ఈ కళా మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.










